హైదరాబాద్: తెలంగాణ రైజింగ్-2047 (Telangana Rising-2047) ప్రణాళికకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో 'HILT పాలసీ' మరియు 'తెలంగాణ రైజింగ్-2047' అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన, పాతబస్తీ అభివృద్ధిపై పలు కీలక విన్నపాలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: పాతబస్తీ అభివృద్ధి: పాతబస్తీలో మరిన్ని ఆసుపత్రులు, ఫ్లైఓవర్లు నిర్మించాలని మరియు రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్య మరియు ఉపాధి: తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం మరింత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక అంశాలు: బాలకార్మిక వ్యవస్థను నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాలుష్య సమస్య: హైదరాబాద్‌లోని పరిశ్రమల వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "పరిశ్రమల వల్ల ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుందో నాకు తెలియదు కానీ, ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీపై విమర్శలు: కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ఆ పార్టీ దేశంలో ఒక "వాషింగ్ మెషిన్" లాగా మారిందని ఒవైసీ ఎద్దేవా చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారు లేదా భారీగా లూటీ చేసిన వారు కూడా బీజేపీలో చేరగానే 'శుద్ధపూసలు' అయిపోతారని, శిక్షల నుండి తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.