హైదరాబాద్: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సరికొత్త రూపాల్లో విరుచుకుపడుతున్న సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు డిజిటల్ అస్త్రంతో షాక్ ఇచ్చారు. సైబర్ మోసాలకు గురైన బాధితులను ఆదుకోవడంలో అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్' (మోసం జరిగిన మొదటి గంట) సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రంగంలోకి దించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాయిస్ అసిస్టెంట్ అద్భుత ఫలితాలను ఇస్తోంది. గతంలో 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే బాధితులు నిమిషాల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ AI సాంకేతికత వల్ల వెయిటింగ్ టైమ్ ఏకంగా 'zero' (సున్నా) కి పడిపోయింది. అసలేం జరిగిందంటే..?గతంలో రోజుకు వందలాది కాల్స్ రావడంతో సగటున 27 కాల్స్ వరకు హోల్డ్‌లో ఉండేవి. దీనివల్ల బాధితులు వివరాలు చెప్పేలోపే మోసగాళ్లు ఆ డబ్బును వేరే అకౌంట్లలోకి మార్చేసేవారు. ఈ ఆలస్యాన్ని నివారించడానికి TGCSB 1930 హెల్ప్‌లైన్‌లో AI వాయిస్ అసిస్టెంట్‌ను అనుసంధానించింది. ఇప్పుడు బాధితులు 1930 నంబర్‌కు కాల్ చేయగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ AI అసిస్టెంట్ లైన్లోకి వస్తుంది. బాధితుడి పేరు, పుట్టిన తేదీ, ఎంత డబ్బు పోయింది, ఏ రూపంలో మోసం జరిగింది, ఏ సమయంలో జరిగింది వంటి ప్రాథమిక వివరాలన్నింటినీ క్షణాల్లో సేకరిస్తుంది. ఈ AI అసిస్టెంట్ ప్రత్యేకతలు:బహుభాషా నైపుణ్యం: బాధితులు తెలుగు, హిందీ, లేదా ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడవచ్చు.తక్షణ అనువాదం: బాధితుడు ఏ భాషలో మాట్లాడినా, AI దానిని తక్షణమే ఇంగ్లీష్‌లోకి అనువదించి (transcribe), పూర్తి వివరాలతో కూడిన ఒక నివేదికను (Structured Complaint Report) తయారు చేస్తుంది. బ్యాంకులకు వేగంగా సమాచారం: ఈ వివరాలు వెంటనే హెల్ప్‌లైన్ సిబ్బందికి అందుతాయి. వారు ఆలస్యం లేకుండా సదరు బ్యాంకులు లేదా ఈ-వాలెట్ సంస్థలను అలర్ట్ చేసి, బాధితుల అకౌంట్ల నుండి చోరీకి గురైన డబ్బును 'ఫ్రీజ్' (స్తంభింపజేయడం) చేస్తారు. గణనీయంగా తగ్గిన సైబర్ నేరాలు.. కోట్లలో రికవరీ!దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 24% పెరుగుతుంటే, తెలంగాణలో తీసుకుంటున్న ఇలాంటి అత్యాధునిక చర్యల వల్ల గత ఏడాది కాలంలో సైబర్ ఫిర్యాదులు 3% తగ్గుముఖం పట్టడం విశేషం. సకాలంలో స్పందించి, AI సాయంతో ఫిర్యాదులు నమోదు చేయడం ద్వారా గత ఏడాది కాలంలోనే పోలీసులు దాదాపు రూ. 280 కోట్లను ఫ్రీజ్ చేయగలిగారు. అందులో రూ. 183 కోట్లను తిరిగి 29,273 మంది బాధితుల ఖాతాల్లోకి చేర్చారు. ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం రూ. 399.6 కోట్లను సురక్షితంగా రికవరీ చేసి బాధితులకు అందించారు. ముఖ్య గమనిక: డీప్‌ఫేక్స్, వాయిస్ క్లోనింగ్, డిజిటల్ అరెస్ట్ మరియు క్రిప్టోకరెన్సీ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ పొరపాటున సైబర్ మోసానికి గురైతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాల్సిందిగా TGCSB అధికారులు కోరుతున్నారు.