Tuesday, June 23, 2026 | Sandesh TV Daily News
Logo

బాసర క్షేత్రంలో భద్రతా వైఫల్యం: మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరణ!

news.title

బాసర: తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ చోరీ జరిగింది. సరస్వతి దేవి ఆలయ పైఅంతస్తులో కొలువై ఉన్న అనుబంధ ఆలయమైన శ్రీ మహంకాళి అమ్మవారి గుడిని టార్గెట్ చేసిన దుండగులు.. పక్కా స్కెచ్‌తో లోపలికి చొరబడి అమ్మవారి వెండి కిరీటం, హుండీని అపహరించుకుపోయారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం భక్తులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పక్కా స్కెచ్‌తో దొంగతనం..పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. దొంగలు ముందుగా ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలకు గుడ్డలు కప్పి, ఆపై మహంకాళి ఆలయ ప్రధాన గేటు తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భగుడిలో ఉన్న సుమారు కిలోకు పైగా బరువుండే అమ్మవారి వెండి కిరీటాన్ని, అలాగే భక్తుల కానుకలతో ఉన్న హుండీని సైతం పెకలించి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణం వెలుపలికి వెళ్లి హుండీ తాళాలు పగలగొట్టి అందులోని నగదు మొత్తాన్ని కాజేశారు. అనంతరం ఖాళీ హుండీని సమీపంలోని వ్యాసగుడి వద్ద పడేసి చాకచక్యంగా పరారయ్యారు. వెలుగులోకి వచ్చిందిలా..మంగళవారం తెల్లవారుజామున నిత్య పూజలు, అభిషేక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆలయ సిబ్బంది, అర్చకులు పైఅంతస్తులోని మహంకాళి గుడికి వెళ్లడంతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఆలయ తలుపులు పగిలి ఉండటం, లోపల సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని దేవస్థాన ఉన్నతాధికారులకు, ఈవో అంజనాదేవికి సమాచారం అందించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్స్‌తో రంగంలోకి పోలీసులు.. ఎస్పీ సమీక్షచోరీ ఘటనపై సమాచారం అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ మరియు ఇతర పోలీసు అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయంలో నిఘా కోసం రాత్రి వేళల్లో ఆరుగురు హోం గార్డులు విధుల్లో ఉన్నప్పటికీ దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టడం భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. ఆలయం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు గుర్తుతెలియని దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. #BasaraTempleTheft #SaraswathiTempleBasara #NirmalDistrictCrime #MahankaliTempleRobbery #TelanganaTemples Security #BasaraEO