హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రతిపాదిత ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం జరుగుతున్న భూసేకరణ వివాదంలో స్థానిక రైతులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. భూముల స్వాధీనం మరియు ఇతర బలవంతపు చర్యలపై తదుపరి విచారణ జరిగే వరకు స్టే ఇస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ఏం జరిగింది?రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ పరిధిలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 650 ఎకరాల భూమిని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా తమ భూముల్లో హైడ్రా (HYDRAA) అధికారులు జెసిబిలతో ప్రవేశించి, కంచెలు ఏర్పాటు చేశారంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాము దశాబ్దాలుగా రిజిస్టర్డ్ సేల్ డీడ్‌ల ద్వారా భూములను కలిగి ఉండి వ్యవసాయం చేసుకుంటున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా భూముల్లోకి ప్రవేశించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం.. తదుపరి విచారణ వరకు పిటిషనర్ల భూముల వద్ద ఎలాంటి బలవంతపు చర్యలు, కూల్చివేతలు లేదా కంచెలు వేసే పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.రైతుల ఆందోళనల నడుమ కీలక పరిణామంబుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం చేపట్టిన భూసేకరణపై గత కొన్ని రోజులుగా బహదూర్‌గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, రైతులు నిరసనలకు దిగడం తెలిసిందే. ఈ తరుణంలో హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు వెలువడడం స్థానిక రైతులకు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఈ కేసు విచారణను ధర్మాసనం తదుపరి తేదీకి వాయిదా వేసింది.#BulletTrain #TelanganaHighCourt #Bahadurguda #LandAcquisition #HyderabadNews #HYDRAA #FarmersRelief #HighSpeedRail #TelanganaNews #LegalUpdates #CurrentAffairs