హైదరాబాద్ – సందేశ్ టుడే -- అంతర్రాష్ట్ర జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులను, అలాగే కొత్తగా ప్రతిపాదించిన 'పోలవరం-బంకాచర్ల' సాగునీటి ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ మంగళవారం (డిసెంబర్ 16) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.ప్రాజెక్టు విస్తరణపై న్యాయపోరాటం:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంకాచర్ల ప్రాజెక్టు కోసం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయడం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులతో పాటు ఏపీ పునర్విభజన చట్టం నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలంగాణ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది విజ్ఞప్తులు చేసింది:పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలి.కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం (CWC) వంటి నియంత్రణ సంస్థలు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికలను లేదా డీపీఆర్‌లను పరిశీలించకుండా ఆదేశాలు జారీ చేయాలి.నీటి మళ్లింపుపై అభ్యంతరాలు:పోలవరం కాలువల ద్వారా కృష్ణా డెల్టాకు కేవలం 80 టీఎంసీల నీటిని మళ్లించేందుకు మాత్రమే అనుమతి ఉందని, కానీ ఏపీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా అదనంగా 200 నుండి 300 టీఎంసీల నీటిని మళ్లించేలా మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందని తెలంగాణ ఆరోపించింది.నిబంధనల ఉల్లంఘన:కేంద్ర జల సంఘం (CWC) అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ వాదించింది. డీపీఆర్ సిద్ధం చేయవద్దని సి.డబ్ల్యూ.సి స్పష్టం చేసినా, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచి, టెక్నికల్ బిడ్లను పూర్తి చేసి, ప్రస్తుతం ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియలో ఉందని పిటిషన్‌లో పేర్కొంది. అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాకముందే ఈ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడం లేదా అనుమతులు ఇవ్వడం సరైనది కాదని తెలంగాణ స్పష్టం చేసింది.