హైదరాబాద్: - సందేశ్ టుడే - కూకట్‌పల్లిలోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (IDPL)కు చెందిన విలువైన భూముల ఆక్రమణ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ భూకబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వివాదంలో ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ. 4,000 కోట్లు ఉంటుందని అంచనా. నేపథ్యం: కూకట్‌పల్లి సర్వే నంబర్ 367లోని ఐడిపిఎల్ భూమిని ఎమ్మెల్యే కృష్ణారావు ఆక్రమించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ఇతర నేతలు ఆరోపించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కార్యాలయం (CMO), మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. కలెక్టర్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా లోతైన విచారణ జరపాలని ప్రభుత్వం విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించింది. వివాదానికి కారణం: 1963లో అప్పటి ప్రభుత్వం ఐడిపిఎల్ సంస్థ కోసం కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట గ్రామాల్లో కలిపి దాదాపు 900 ఎకరాలను కేటాయించింది. అయితే, కూకట్‌పల్లి సర్వే నంబర్ 367కు, మూసాపేటలోని కొన్ని సర్వే నంబర్లకు సరిహద్దు వివాదాలు ఉండటంతో, కొందరు వ్యక్తులు ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని భూములపై హక్కులు కోరుతున్నారు. కాగా, ప్రభుత్వ విచారణ నిర్ణయాన్ని అటు కవిత, ఇటు ఎమ్మెల్యే కృష్ణారావు ఇద్దరూ స్వాగతించడం గమనార్హం.