ఏ మతానికి లేదా వర్గానికి వ్యతిరేకంగానైనా సరే.. విద్వేష ప్రసంగాలు చేయడం, అల్లర్లకు దారితీసేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం వంటి వాటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. గత రాత్రి (డిసెంబర్ 23) హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతపరమైన ద్వేషాన్ని నిర్మూలించడంపైనే ఈ చట్టం ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. ఇతర మతాలను దూషించే లేదా కించపరిచే నేరగాళ్లకు కఠిన శిక్షలు పడేలా ప్రస్తుతం ఉన్న చట్టాలకు కూడా సవరణలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను, వర్గాలను సమానంగా చూస్తుందని స్పష్టం చేస్తూ.. "ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది, అదే సమయంలో ఇతర మతాలను గౌరవించాల్సిన సమాన బాధ్యత కూడా అందరిపై ఉంది" అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.