హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన ₹1.95 కోట్ల సైబర్ మోసం కేసును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఒక మహిళను భయభ్రాంతులకు గురిచేసి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిన గుజరాత్‌కు చెందిన సయ్యద్ సోయబ్ జాహిద్ భాయ్, బెలిమ్ అనాస్ రహీమ్ భాయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం జరిగింది ఇలా: బెదిరింపులు: డిసెంబర్ 13న బాధితురాలికి ఫోన్ చేసిన నిందితులు.. తాము ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఆమె భర్త తీవ్రమైన నేరాల్లో చిక్కుకున్నారని, వెంటనే అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. మాయమాటలు: కరెన్సీ సీరియల్ నంబర్ల వెరిఫికేషన్ మరియు కేసు క్లియరెన్స్ పేరుతో నమ్మించి, బాధితురాలి నుండి ఏకంగా ₹1,95,76,000 ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నిజాలు: మ్యూల్ అకౌంట్స్: నిందితులు అమాయకుల పేరుతో ఉన్న 'మ్యూల్' బ్యాంకు ఖాతాలను వాడారు. వీరు వసూలు చేసిన సొమ్మును హవాలా మార్గంలో దుబాయ్‌లోని ప్రధాన సూత్రధారులకు చేరవేస్తున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు వెల్లడించారు. కమీషన్ల దందా: జాహిద్ భాయ్ ఖాతాల ద్వారా జరిగే లావాదేవీలపై 15% కమీషన్ తీసుకునేవాడు. వీరిద్దరూ అలవాటు పడ్డ నేరగాళ్లని, ఇప్పటివరకు వీరు వాడిన ఖాతాలు దేశవ్యాప్తంగా 22 కేసుల్లో సంబంధం కలిగి ఉన్నాయని పోలీసులు గుర్తించారు. భారీ లావాదేవీలు: వీరి ఖాతాల ద్వారా ఇప్పటివరకు సుమారు ₹3.5 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్య గమనిక: ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ కాల్ ద్వారా ఎవరినీ 'డిజిటల్ అరెస్ట్' చేయదని, ఇటువంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.